హర్యానా రాష్ట్రం పంచకుల లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాఠశాల విద్యార్థులు గాయాలపాలయ్యారు . పింజోర్‌లోని నౌల్టా గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు నౌల్టా గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ నగరంలోని పింజోర్ ఆసుపత్రి, సెక్టార్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ప్రయాణికురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పీజీఐ చండీగఢ్‌కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు బస్సులో ఓవర్‌లోడ్, రోడ్ల అధ్వాన స్థితి కూడా ప్రమాదానికి దారితీసిన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com