
కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసులకు ఓబీసీ కింద జారీ చేసిన సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు... ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com