
ఆంధ్రప్రదేశ్‌లో బాలింతలకు ఇచ్చే పాలల్లో పురుగులు రావడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలని ప్రేమ ఒలకబోసే నేతలు.. పౌషకాహారం ఇంత అధ్వానంగా ఉంటే ఏం పర్యవేక్షిస్తున్నారని మహిళలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పోలినాయుడుకండ్రిగలోని అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకులు గర్భిణులు, బాలింతలకు ఇటీవల పంపిణీ చేసిన పాలు గడ్డకట్టుకుపోయి.. పురుగులు పట్టాయి. జనవరి 14 వరకూ వాడుకోవచ్చని ఆ టెట్రా ప్యాకెట్లపై ఉంది. దీంతో శనివారం ఓ లబ్ధిదారు ప్యాకెట్లు తెరవగా అందులోని పాలు పూర్తిగా గడ్డకట్టి ఉన్నాయి. వాటిలో తెల్ల పురుగులు కనిపించాయి. దీనిపై అంగన్‌వాడీ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు వచ్చిన వాటిని పంపిణీ చేశామని.. అంతకు మించి ఏమీ తెలియదని చేతులెత్తేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com