
అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయమే చంద్రబాబు పిటిషన్లు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. అంగళ్లు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సి ఉంటుందని... అసలు ఆ ఘటన జరగడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు తరపు లాయర్లు.. ఆయన విచారణకు సహకరిస్తారని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఆయన్ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. అనంతరం వాదనలు ప్రారంభం అవ్వగా.. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని.. ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్........ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అనంతరం కోర్టు చంద్రబాబుకు స్వల్ప ఊరట అందిస్తూ హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు వెలువరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com