
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎంతో సమావేశమైన డీజీపీ.. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి హత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని సీఎం డీజీపీతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్దేశించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీస్ శాఖలో ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మరిన్ని బదిలీలు జరగొచ్చని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com