SURAT: సూరత్‌లో రాముడి అతిపెద్ద ముగ్గు

SURAT: సూరత్‌లో రాముడి అతిపెద్ద ముగ్గు

గుజరాత్‌లో 11 వేల 111 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వానరసేనను రంగవల్లుల రూపంలో చిత్రించి సూరత్‌ మహిళలు రామునిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక కతర్గాం కమ్యునిటీ హాల్‌లో కనులవిందు చేసే ఈ ముగ్గును వేశారు. ఈ కార్యక్రమంలో కలర్పన్‌ ఆర్ట్‌ సమూహానికి చెందిన సుమారు 40 మంది మహిళలు పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ముగ్గు వేయడానికి 14 వందల కిలోల రంగులను వినియోగించినట్లు చెప్పారు. 40 మంది మహిళల 15 గంటల నిరంతర శ్రమ ఫలితమే ఈ అద్భుతమైన ముగ్గని వారు తెలిపారు.


చూపరులను మంత్రముగ్ధుల్ని చేసే ఈ రంగవల్లిని రూపొందించడంలో ఎటువంటి పరికరాలను ఉపయోగించలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే, జౌళిశాఖ సహాయక మంత్రి దర్శన జర్దోష్‌ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆమె కూడా రంగులను అద్దారు. ప్రస్తుతం సూరత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. కళారంగంలో సైతం సూరత్‌ అగ్రగామిగా నిలిచినట్లు సందేశం పంపినట్లైందని వెల్లడించారు.


Next Story