
నవరత్నాల్లో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని, మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుందని, నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బైజూస్ కంటెంట్ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయటం లేదని, దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే.. తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతానని బొత్స ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశగా 12రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com