అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించేందుకు బీఆర్ఎస్‌ సిద్దం

అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించేందుకు బీఆర్ఎస్‌ సిద్దం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలు… ఇప్పుడు అభ్యర్ధుల జాబితా రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. ఇవాల్టి నుంచి నిజ శ్రావణ మాసం మొదలైంది. శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. రేపు శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి విశేషమైన రోజుగా ఎంచుకుంటారు. అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రచారం వంటివి శ్రావణమాసంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రావణమాసంలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉందటున్నారు రాజకీయ పరిశీలకులు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శ్రావణంలోనే ప్రకటించింది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్‌ కొనసాగించే అవకాశం ఉంది. శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదంలో ప్రథమార్ధం వినాయక చవితి సందడితో ముగుస్తుంది. ద్వితీయా ర్ధం పితృపక్షాలను అంత శుభకరంగా భావించరు.

గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సెప్టెంబర్‌ 7, 2018 న శుక్రవారం రోజే ప్రకటించింది. ఇప్పటికే 80 నుంచి 87 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రావణమాసంలో ఏ క్షణంలో అయినా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోలేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు, ఈ నెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని విశేషమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో అదేరోజు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం లేకపోలేదు. అంతేకాదు, శ్రావణంలో శుక్ల దశమి, పౌర్ణమి, కృష్ణపక్షంలో విదియ, తదియ కూడా అభ్యర్థుల ప్రకటనకు, ఇతర రాజకీయ ఎత్తుగడలకు అనువైన రోజులుగా పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ నెల 21 నుంచి సెప్టెంబర్‌ 2 లోపు తొలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆషాడం, అధికమాసం పూర్తి కావడంతో జాబితా రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్‌.

మరోవైపు శ్రావణం ముగిసేలోపు మ్యానిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తోంది కాంగ్రెస్‌. సెప్టెంబర్‌ 15న సోనియా గాంధీతో చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల చేయించాలన్నది టీపీసీసీ యోచన. అభ్యర్థుల దరఖాస్తులకు ఈ శ్రావణం లోనే శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఆ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం వల్ల నష్టం జరిగిందని, ఈసారి అలా జరగకుండా దశల వారీగా జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇక.. బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌లో ఒక సీటుకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండగా, కాంగ్రెస్‌కు ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగ్గ అభ్యర్థులు కనిపించడం లేదు. సిట్టింగ్‌ ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపాల్సిందిగా రాష్ట్ర బీజేపీని అమిత్‌ షా ఆదేశించారని సమాచారం. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారని, మిగతా సెగ్మెంట్ల కోసం అభ్యర్థులను వెతకాల్సిందిగా పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.

Next Story