
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందన్నారు. మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. ప్రజా జీవితంలో ఉన్నానని చట్టాన్ని గౌరవించే వ్యక్తినన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com