
వైసీపీ ఎమ్మెల్యేలతో దొంగపని చేయించిన జగన్‌ను మార్చకుండా, ఎమ్మెల్యేల్ని మారిస్తే సరిపోతుందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఇంకా వందరోజులే మిగిలి ఉందని అన్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటనకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుడిపల్లి మండలం బిసానత్తము వద్ద గజమాలతో ఆహ్వానించారు. గుడిపల్లిలో రైల్వే స్టేషన్ కూడలి నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ బహిరంగసభలో పాల్గొన్నారు. వైసీపీకి మరో వందరోజులే మిగిలి ఉందని, ఊరికో రౌడీని తయారు చేశారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఓ కథ చెప్పిన చంద్రబాబు.. వైకాపా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల్ని మార్చడాన్ని ఎద్దేవా చేశారు. బస్సు సౌకర్యం తీసేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యువతకు, మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రాత్రి కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com