Telangana: గెలుపు కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహం

Telangana:  గెలుపు కోసం కాంగ్రెస్  కొత్త వ్యూహం

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 14లోక్ సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీటు ఇచ్చేందుకు సునీల్ కనుగోలు బృందంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతల పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్ సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం... ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా TPCC వడపోత పూర్తి చేసి.. స్క్రీనింగ్ కమిటీకి నివేదించింది. హరీష్ చౌదరి ఛైర్మన్ గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి ముగ్గురు లెక్కన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లతో కలిసి రెండు గంటలపాటు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై సునీల్ కనుగోలు బృందం ఆరా తీస్తోంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసిన ముఖ్య నేతలతో పాటు పార్టీలో చేరిన, చేరనున్ననాయకుల బలాబలాలపైనా సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేపడుతోంది

Next Story