
విశ్వనగరిగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం సీజన్‌లో తొలి వర్షాలకే అతలాకుతలమవుతోంది. మరో రెండు నెలలు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పరిస్థితి ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తోంది.వరుణుడి ప్రతాపంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దైపోయింది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. పలు కాలనీల్లో ఇళ్లలోకే వరద నీరు చేరడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో ఎటూ చూసిన వరద నీరే దర్శనమిస్తుంది. బయట అడుగు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. ఎక్కడ ఏ నాలా ఓపెన్‌లో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
మరోవైపు హుస్సేన్ సాగర్‌ను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని,నాలాల దగ్గర ఆక్రమ నిర్మాణాలతోనే ఇబ్బందులు వస్తున్నాయిని అన్నారు. ఆక్రమ నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు తలసాని.
ఇక ఈ వర్షాకాలం సీజన్‌లో ఈ నెల మొత్తం మీద పడాల్సిన సగటు వర్షం గడిచిన 24 గంటల్లో దంచికొట్టడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు ఎగువ నుంచి భారీగా వచ్చిన వరద నీటితో జలాశయాలు నిండి కుండగా తయారు కాగా, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వాటి గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని వదలడంతో పరీవాహక, లోతట్టు ప్రాంతాలు జలమయమై అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలోనే భారీ వర్షాలు కురుస్తాయి. ఎగువ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి జలాశయా ల్లో చేరుతోంది. వర్షకాలం తొలి రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత పడే వర్షాలతో పరిస్థితేంటి అని నగర వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com