
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ లక్ష్యంగా క్షిపణి దాడి యత్నం జరిగినట్లు సమాచారం. అయితే వారు ఈ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో పడినట్లు సమాచారం. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో జరిగింది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్‌తో కలిసి జెలెన్‌స్కీ నగర సందర్శనకు బయల్దేరారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పుట్టగొడుగు ఆకారంలో భారీగా పొగ పైకి ఎగసిపడటాన్ని ప్రత్యక్ష సాక్షులు వీక్షించారు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. గత రెండేళ్లుగా జెలెన్‌స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపర్చేందుకు పలువురు ప్రపంచ నాయకులతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కానీ బుధవారం నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com