
భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ప్రయోగ పరీక్షను ఓ సరస్సులో నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా డీఆర్‌డీవో వెల్లడించింది. భూ ఉపరితలంపై, నీటిలోనూ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షలో వెహికల్ సోనార్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది. భూతల, సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్, శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది. 6 టన్నులు బరువు ఉండే ఈ వాటర్ డ్రోన్ పొడవు 9.75 మీటర్లని తెలిపింది. గరిష్ఠంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యమున్న ఇది 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com