
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన కోడికత్తి ఘటన జరిగి అయిదేళ్లయింది. విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి జరిగింది. ఈ దాడిని 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రచార అస్త్రంగా మార్చుకుని లబ్ధిపొందింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీను నేటికీ విచారణ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించినా, ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి విశాఖ ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి చేరింది. కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని జగన్ ఈ నెల 17న హైకోర్టును ఆశ్రయించారు. దళిత యువకుడి హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు 6 నెలల్లోపే బయటకొచ్చారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టయిన 5 నిమిషాల్లో బెయిల్ పొందారు. కానీ కోడికత్తి కేసులో అయిదేళ్లయినా బెయిల్ రాకపోవడం విచిత్రంగా ఉందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com