
విద్వేషతపూరిత ప్రసంగం కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని (Mufti Salman Azhari) గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ ప్రసంగించారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ ప్రసంగాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్‌చేశారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో జునాగఢ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేశారు.
అయితే ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్లాం బోధకుడు అజారీని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు.. ముంబై అర్బన్ జిల్లాలోని ఘట్కోపర్ పీఎస్‌లో ఉంచారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ముఫ్తీ మద్దతుదారులు గుమికూడారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.
విద్వేశపూరిత ప్రసంగం చేసినందుకుగాను ఐపీసీ 153B (మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 505 (2) (ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం) సెక్షన్ల కింద అజారీతోపాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మహ్మద్ యూసుఫ్ మాలెక్, అజీమ్ హబీబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com