
కోనసీమలో ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, మామిడికుదురు, రాజోలుల్లో ప్రభల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబాజీపంట మండలంలో ప్రసిద్ధి గాంచిన జగ్గన్న తోట ప్రభల తీర్థానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పురాణ ప్రాశస్తం ప్రకారం... ఏకాదశ రుద్రులు కనుమ పండగ రోజు దేశం మొత్తం మీద కొలువు తీరేది జగ్గన్న తోటలోనే కొలువుతీరతారు. ఏకాదశ రుద్రుల్ని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యంలో భక్తులు తరలివచ్చారు.
గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాలకు చెందిన సర్వమంగళ పార్వతి సమేత చెన్నమల్లేశ్వరస్వామి, పార్వతీవీరేశ్వరస్వామి ప్రభల్ని పంట కాల్వలు, వరిచేల మధ్య నుంచి ఎగువ కౌశిక నదిని దాటించి యువకులు భుజాలపై మోసుకొచ్చారు. ఈ దృశ్యాలను భక్తజనం తిలకించి అమితానందం పొందారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల ప్రభలు, రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలను అందంగా అలంకరించి భక్తులు భజాలపై మోసుకొచ్చారు. వాకలగరువులోని ఉమాపార్వతీ సోమేశ్వరస్వామి, తొండవరంలోని ఉమాతొండేశ్వరస్వామి, గున్నేపల్లి అగ్రహారంలోని పార్వతీరామేశ్వరస్వామి వార్ల ప్రభలకు తీర్థం నిర్వహించారు. పి.గన్నవరం మండలంలో వివిధ చోట్ల 80 ప్రభలను తీర్ధానికి తీసుకువచ్చారు. కోనసీమ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభల తీర్థాలకు జనం తరలివచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com