
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ఆ రెండు దేశాలకు ప్రయాణాలు చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, భారత ఎంబసీతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నది. ఈ రెండు దేశాల గగనతలంలో వాణిజ్య విమానాలకు అనుమతించిన నేపథ్యంలో ఎంఈఏ ఈ సూచన చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. కాగా, కమర్షియల్ విమానాల రాకపోకల కోసం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఇటీవల తమ గగనతలాలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఉద్రిక్తతలు కొనసాగితే, గగనతలం తెరిచే ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గత నెల ఇజ్రాయెల్‌పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వాటన్నింటినీ నిరోధించిన ఇజ్రాయెల్.. ఎదురుదాడికి సిద్ధమైంది. దాంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ దళాలు, హెజ్‌బొల్లా మధ్య సరిహద్దులో రోజూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆ రెండు దేశాల్లో ఉన్న/వెళ్లాలనుకునే వారి కోసం గతంలోనే ఎంఈఏ అడ్వైజరీ జారీ చేసింది. తాజాగా వాటికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com