PAWAN: నేడు తెలంగాణలో జనసేనాని ప్రచారం

PAWAN: నేడు తెలంగాణలో జనసేనాని ప్రచారం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులతోపాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు వరంగల్ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ కు మద్దతుగా 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలాగే తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల్లోనూ అధికారికంగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఎన్నికల్లో భాజపాతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న భాజపాకు మద్దతు ఇస్తుంది. ఈ క్రమంలో ఇరుపార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


తెలంగాణలో పుట్టి ఏపీలో ఎదుగుతున్న పార్టీ జనసేన. పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశంతో కలిసి విస్తృత పోరాటాలు చేస్తోంది. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలోనూ ఉనికి చాటుకోవాలనుకుంటుంది. దశాబ్దికాలంగా రాష్ట్రంలో ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. NDAలో భాగస్వామిగా ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని 8 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో ప్రధాన పార్టీలతో పాటు తొలిసారిగా జనసేన బరిలోకి దిగింది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూకట్‌పల్లి- ప్రేమ్‌కుమార్‌, తాండూరు-శంకర్‌గౌడ్‌, ఖమ్మం-రామకృష్ణ, కొత్తగూడెం-సురేందర్‌ రావు, వైరా-సంపత్‌ నాయక్‌, అశ్వారావుపేట- ఉమాదేవి, కోదాడ- సతీష్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో వంగ లక్ష్మణ్‌గౌడ్‌ అనే అభ్యర్థులను పోటీలో నిలిపింది.


ఎనిమిది మందిలో ఇద్దరు మినహా మిగతా ఆరుగురు కొత్తవాళ్లకే అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో పొత్తును ఇక్కడా కొనసాగించాలని భావించినప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. బీజేపీ అగ్రనాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో పవన్‌ కల్యాణ్‌ చర్చలు జరిపి ఆయా నియోజకర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించారు. LBస్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొని ఇరుపార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. 2020లో జరిగిన బల్దియా ఎన్నికల్లో పరోక్షంగా తన ప్రభావాన్ని 48 స్థానాల్లో చూపించి బీజేపీ గెలుపునకు సహకరించింది. కూకట్ పల్లి స్థానాన్ని ఒడిసిపట్టాలనే వ్యూహంతో ప్రేమ్‌కుమార్‌ విజయం కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాయి.

Tags

Next Story