
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్‌లోని రామా ఫంక్షన్‌హాలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం రాత్రి బలవంతంగా భగ్నం చేశారు. శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజుతో పాటు కుటుంబసభ్యులను తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్దసంఖ్యలో శిబిరం దగ్గరకు వచ్చారు. దీక్ష విరమించాలని ఆమెను కోరారు.
జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితేనే తాను దీక్ష విరమిస్తానని సావిత్రమ్మ తేల్చిచెప్పారు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు భారీగా శిబిరం వద్ద మోహరించారు. దీక్ష చేస్తున్నవారిని తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా సమతా సైనిక్‌దళ్ సభ్యులు, ఇతర మద్దతుదారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల నడుమ వారిని అత్యవసర వాహనంలో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సమతా సైనిక్‌దళ్ నాయకులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక కార్యకర్త పెట్రోల్ సీసా తీసుకుని, ఆత్మాహుతికి యత్నించగా.. పోలీసులు అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com