TTD: కన్నులపండువగా శ్రీనివాసుని గరుడ సేవ

TTD: కన్నులపండువగా శ్రీనివాసుని గరుడ సేవ

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో విశిష్టమైన గరుడ సేవ కన్నుల పండువగా జరిగింది. తిరుమల వెంకన్న మలయప్పస్వామి రూపంలో గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా వీక్షించి, తరించేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దాంతో తిరుమాడ వీధులు ఇసుకేస్తే రాలనంతగా భక్త జనసంద్రాన్ని తలపించాయి. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన 231 గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయారు. గరుడ వాహన సేవను భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా ,టీటీడీ తిరుమల అంతటా భారీ ఎలక్ట్రానిక్ తెరలను ఏర్పాటు చేసింది. గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మార్మోగింది.


భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. భక్తజనం గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. సుమారు 3.5 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించారు. గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు.. 3వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

Next Story