
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ కేసులో లోకేశ్‌ను ఇప్పటివరకూ ముద్దాయిగా చేర్చలేదని C.I.D. తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసులో పేరు లేనందున ఆయనను అరెస్ట్ చేయబోమని న్యాయమూర్తికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో లోకేష్ పేరు చేర్చితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరిస్తామన్నారు. CID వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం అరెస్టు అంశం లేనందున లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈ నెల 4నే విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించిన న్యాయస్థానం.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్‌ను అరెస్టు చేసేందుకు అవకాశం ఉన్నందునే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com