
దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1964 జులై 1న జన్మించిన ఉపేంద్ర డిసెంబరు 15, 1984లో జమ్మూ-కశ్మీర్ రైఫిల్స్ దళంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం ఆయన్ను వరించాయి. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. జనరల్ పాండే మే 31నే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్రం ఆయన పదవీకాలాన్ని నెలపాటు పొడిగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగించడం అత్యంత అరుదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com