
పోలాండ్‌లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. వార్సా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇప్పటి వరకు చాలా వెరైటీ దొంగతనాలు చూసాం అందులో ఇది ఒక వింతైన రకం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఓ షాపింగ్ సెంటర్‌లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకుండా మెదలకుండా ఉండిపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.
షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత రోజు చక్కగా కస్టమర్స్ అందరితోనూ కలిసి బయటకు వెళ్ళిపోయాడు. దారిలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ అతని లక్ కలిసిరాక సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు మరో షాపింగ్ సెంటర్‌లో కూడా ఇలాగే చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com