
ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పర్యటించారు. తొలుత రాప్తాడులో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన జట్టు కట్టాయన్నారు.ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ నిలువునా ముంచేశారని ఆరోపించారు. కేసులు, బెదిరింపులకు భయపడవద్దని సూచించిన ఆయన.. జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యతను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తర్వాత శింగనమల నియోజకవర్గంలోని.. బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ ఐదేళ్లుగా ఎస్సీలను దగా చేశారని విమర్శించారు. 1997లో నాడు తాను తెచ్చిన ఎస్సీ వర్గీకరణను ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రొద్దుటూరులో వివేకా హత్యపై జగన్ చేసిన వ్యాఖ్యలకు..ఘాటుగా బదులిచ్చారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానంటూ జగన్ చెప్పిన మాటలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ని శాశ్వతంగా ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com