
ఒడిశాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ భర్త.. తన భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లడం సభ్య సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహాయంతో ఆమె భర్త 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. మూడు నెలల క్రితం తన భార్య కరుణ ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. అప్పటినుంచి కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీ పురుణగూడలోని తన పుట్టింట్లో ఉంటోందని మృతురాలి భర్త అమానత్య తెలిపాడు. కరుణ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతిచెందిందని.. అంత్యక్రియలు తన ఇంటివద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్ జిల్లా నందహండి సమితి జగన్నాథ్‌పూర్ పంచాయతీ ఫుపుగావ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్, మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదని అందుకే తన భార్య మృతదేహాన్ని మోసుకెళ్లినట్లు తెలిపాడు. వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో శనివారం ఉదయం కరుణ మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లానని ఆవేదన వ్యక్తం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com