
చిత్తూరు జిల్లా చారిత్రక చంద్రగిరి రాలయవారికోట సమీపంలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. రాయలవారికోటకు పడమర దిశలోని మండపానికి ఎడమ వైపున షేక్ ముజీబ్‌కు సుమారు రెండెకరాల మామిడితోట తమ వంశపారంపర్యగా సంక్రమిస్తోంది. రైతు ముజీబ్ తోటలో ముళ్ల పొదళ్లు, ఎత్తుపళ్లాలను చదును చేసి కొత్తగా మామిడి మొక్కలు, కూరగాయల సాగుకు శనివారం జేసీబీతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో తోటలో చిన్నపాటి గుట్టగా ఉన్న మట్టిదిబ్బను తొలగించి శుభ్రం చేస్తుండగా అతి ప్రాచీనమైన పెద్ద రాతిబండల కట్టడం బయటపడింది. విషయాన్ని రైతు రాయలవారికోట అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పురావస్తుశాఖ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పెద్దపాటి బండలతో వరుస క్రమంలో నిర్మించిన పురాతన కట్టడాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతం మినహాయించి తోటను చదును చేసుకోవాలని రైతుకు సూచించారు. ఈ కట్టడం 11వ శతాబ్దానికి సంబంధించినదిగా అధికారులు భావిస్తున్నారు. కట్టడం బయటపడంతో స్థానికులు, కోట సందర్శకులు, పర్యాటకులు ఫొటోలు తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com