
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. జగన్ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం దిల్లీకే పరిమితమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామ.. ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com