
హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెనుప్రమాదం తప్పింది. చెన్నె నుంచి వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఐదో ప్లాట్‌ఫాంవద్ద డెడ్‌ఎండ్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో మూడు బోగీలు పట్టాలు తప్పి ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్టేషన్‌లో ఆగేందుకు నెమ్మదిగా వస్తున్న క్రమంలోనే గోడను ఢీకొట్టడంతో పెద్దగా నష్టంజరగలేదు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది...పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, ప్రమాదానికి గురైంది. ఉదయం 8గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోనే చాలావరకు ప్రయాణికులు దిగిపోగా మిగిలిన వారితో చివరి స్టేషన్ నాంపల్లికి వచ్చింది. ఐదోప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు ఆగే సమయంలో డెడ్‌ఎండ్ గోడని ఢీకొట్టింది. ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా... మూడు బోగీలు "S-2, S-3, S-6” పట్టాలు తప్పాయి అప్పటికే దిగేందుకు సిద్ధమై, డోర్ల వద్ద నిలబడిన ప్రయాణికులు.... భయాందోళనకు గురై పరుగులు తీశారు. బోగీల కుదుపుతో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. ….ఇబ్రహీం అనే ప్రయాణికుడికి ఛాతి వద్ద గాయమైంది.
ప్రమాదాన్ని గమనించిన స్టేషన్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలుచేపట్టారు. గాయపడిన ఆరుగురిని లాలాగూడ రైల్వేఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటికి దిగటంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. ఐదో ప్లాట్ ఫాంలో ప్రమాదంచోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేసి, పునరుద్దరణ పనులు చేపట్టారు నాంపల్లిస్టేషన్‌లో ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరాతీశారు. ఘటనకు గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com