
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి షరతుల్లేని మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. గత నెలలో రాజ్ ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com