
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌సీఎం అధికారులు సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్న పనులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.. చినుకు పడితే మునిగిపోయే ప్రాంతాలను పట్టించుకోని కార్పొరేషన్ యంత్రాంగం, ఆనం కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానంలో అనవసర ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేపడుతోందని ఫైరవుతున్నారు. ఇవేం పనులంటూ బహిరంగంగానే మండిపడుతున్నారు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆనం కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం ప్రహరీ గోడకు లక్షలు ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేపట్టారు. లక్షల రూపాయల వ్యయంతో రంగులు వేసి నిధులు వృధా చేయడమే లక్ష్యంగా అధికారుల తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. గతంలో రంగులతో ఉన్న ప్రహరీ గోడలను ఆగమేఘాల మీద కూల్చేశారు అధికారులు. వర్షంలోనూ నిరాటంకంగా పనులు కొనసాగిస్తున్నారు. ఉన్న వాటిని కూలగొట్టడం ఎందుకు, కొత్తగా రంగులేయడం ఎందుకని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చి తమ వాటాల కోసమే అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలు చేపడుతోందని విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారి అయిన కంబాల చెరువు హైటెక్ బస్టాండ్, కోరుకొండ రోడ్ సహా పలు ప్రాంతాల్లో గోదావరిని తలపించేలా వర్షం నీరు నిలిచిపోయింది. బస్సులు ఆగి ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు కనిపించాయి. అయితే, ముంపు సమస్య నుంచి బయటపడే మార్గం గురించి ఏమాత్రం ఆలోచించని కార్పొరేషన్ అధికారులు. ఇలా సుందరీకరణ పనులకు కోట్లు తగలేయడం ఎందుకని పబ్లిక్ ఫైరవుతోంది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com