AYODHYA: ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న రామ నామం

AYODHYA: ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న రామ నామం

అయోధ్య రామ మందిరం ప్రారంభంకానున్న వేళ ప్రపంచవ్యాప్తంగాను సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలో భారతీయులు ఇప్పటికే భారీ కార్ల ర్యాలీ నిర్వహించగా, యూకే, ఆస్ట్రేలియాల్లోనూ జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. యూకేలో భక్తులకు పంచేందుకు పెద్ద ఎత్తున లడ్డూలు తయారు చేశారు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని మేరీల్యాండ్‌లో 150 కార్లతో రామ భక్తులు ర్యాలీ నిర్వహించగా తాజాగా యూకే, ఆస్ట్రేలియాల్లోనూ వైభవంగా వేడకులు జరుపుకున్నారు. లండన్‌లో 300లకుపైగా కార్లతో చేపట్టిన ర్యాలీ ఆకట్టుకుంది. పలువురు యువతీ, యువకులు డోలు వాయిస్తూ..రామనామం జపించారు. తొలుత గణపతి పూజ చేసిన నిర్వాహకులు అనంతరం రాముడి జెండాలను చేతపట్టి దేవుడి చిత్రపటాలతో కార్ల ప్రదర్శన చేశారు.


అయోధ్య నుంచి యూకేలోని ప్రవాస భారతీయుల కోసం అక్షింతలు, కలశాలు వచ్చాయని ఓ పూజారి తెలిపారు.ఆ అక్షింతలను భక్తులను పంచిపెడుతున్నట్టు చెప్పారు. ప్రాణప్రతిష్ఠ వేళ యూకేలో ప్రత్యేకంగా లడ్డూలు తయారు చేయించారు. వాటిని భక్తులకు ప్రసాదంగా ఇవ్వనున్నారు. రాముడిపై భక్తిని చాటి చెప్పుతూ ఓ మహిళ పాడిన పాట ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనూ రామ భక్తులు 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Next Story