
అన్నమయ్య జిల్లాలో (Annamayya District) ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావటంతో.....సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్ల దాడిలో పోలీసు గణేష్ చనిపోవడం తెలుగుదేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు (Chandra Babu) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన తీవ్ర బాధాకరమన్న చంద్రబాబు స్మగ్లర్లకు టిక్కెట్లిచ్చే జగన్ (Jagan) ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమిస్తుంటే పోలీసులను లెక్కచేస్తారా అని ప్రశ్నించిన ఆయన...టాస్క్ ఫోర్స్ ను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎర్రచందనం స్మగ్లర్లపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com