REVANTHREDDY: టీఎస్‌పీఎస్‌పీ బోర్డు ఏర్పాటయ్యాకే నియామకాలు

REVANTHREDDY: టీఎస్‌పీఎస్‌పీ బోర్డు ఏర్పాటయ్యాకే నియామకాలు

TSPSC కొత్త బోర్డు ఏర్పాటయ్యాకే నియామకాలు చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజావాణి పకడ్బందీగా అమలు చేస్తామన్న సీఎం... గత ప్రభుత్వ పాలనాతీరుపై విమర్శలు గుప్పించారు. ఉన్న భవనాలను కూల్చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. TSPSC ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని తేల్చిచెప్పిన సీఎం...కొత్త బోర్డు ఏర్పాటు చేసి నియామకాలు చేపడతామన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 24 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సీఎం తెలిపారు. ఫిర్యాదులను స్థానిక అధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.

ప్రజావాణి విజయవంతమైనట్లేనని వ్యాఖ్యానించిన సీఎం...ఓ మహిళకు ఇటీవల కేటీఆర్‌ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంపైనా స్పందించారు. గత ప్రభుత్వం ఉన్న భవనాలను కూల్చడం వల్ల ఏం లాభం జరిగిందని ప్రశ్నించిన సీఎం.. కోట్ల రూపాయల విలువైన కార్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచి పెట్టారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్న సీఎం... ఆరున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచారని ఆరోపించారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.

Next Story