Hvaldimir: రష్యా నిఘా తిమింగలం మృతి

Hvaldimir: రష్యా నిఘా తిమింగలం  మృతి

రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకెక్కిన ‘హ్వాల్దిమిర్‌’ అనే బెలుగా తిమింగలం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు కలిగిన ఇది ఆగస్టు 31న స్టావంజర్‌ దగ్గరలోని బే ఆఫ్‌ రిసవికాలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. 2019లో ఉత్తర నార్వేలోని హామర్‌ఫెస్ట్‌ సమీపంలో మొదటిసారిగా ఈ తిమింగలం కనిపించింది. దానికి నార్వే నుంచి ‘హ్వాల్‌’, రష్యా నుంచి ‘వాల్దిమిర్‌’ పేర్లు కలిపి ‘హ్వాల్దిమిర్‌’ అని పెట్టారు. దీని మెడకు సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ అనే లేబుల్ ఉండడంతో ఇది రష్యా నిఘా వర్గంలో భాగమనే ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి రష్యా స్పైగా వార్తల్లోకెక్కింది. అయితే.. వీటిపై స్పందించిన రష్యా అది తమ వేల్‌ కాదని స్పష్టం చేసింది.

మెరైన్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు, హ్వాల్దిమిర్‌ సంరక్షణ బాధ్యతలు చూసుకునే సెబాస్టియన్‌ స్ట్రాండ్‌ దీని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. దీని మరణం నార్వేలోని వేలాది మంది ప్రజల హృదయాలను తాకిందన్నారు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హ్వాల్దిమిర్‌ మృతికి ముందు ఎంతో ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు.

Next Story