
ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది 95 సంవత్సరాల వయసున్న ఫాలీ నారీమన్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్ 22 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులై ఢిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1991 నుంచి 2010 వరకూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగానూ పని చేశారు. భారత న్యాయ వ్యవస్థకు నారీమన్ ను భీష్మ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు.
న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. నారీమన్ ఓ గొప్ప రచయితగానూ గుర్తంపు పొందారు. 'బిఫోర్ ది మెమొరీ ఫేడ్స్', 'ది స్టేట్ ఆఫ్ ది నేషన్', 'ఇండియాస్ లీగల్ సిస్టమ్: కెన్ ఇట్ బి సేవ్డ్?', 'గాడ్ సేవ్ ది సుప్రీంకోర్టు' వంటి పుస్తకాలు రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com