
తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.
గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు పూర్తికానందున విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్‌రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా చెబుతుందా? అన్నది తేలుతుంది. హైకోర్టులో తాను దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత, ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కేసును విచారించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com