BABU HEALTH: చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌

BABU HEALTH: చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు ఆదివారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని పేర్కొన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు వీపు, నడుము, ఛాతీ, చేతులు, గడ్డం ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయని, తీవ్రమైన దురద ఏర్పడిందని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఛాతీ, వీపు, పొట్ట, నడుము భాగాల్లో ఎర్రటి దట్టమైన దద్దుర్లు, పొక్కులు, గడ్డంపై ఎర్రటి దద్దుర్లు ఉన్నట్లు గమనించామని తెలిపారు. రెండు అరచేతుల్లో చీము పొక్కులు చితికిపోవడం వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల ఇబ్బంది పడుతున్నారని రాజమండ్రి జీజీహెచ్‌ చర్మ సంబంధ వైద్య నిపుణులు డాక్టర్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ సునీత జైలు ఉన్నతాధికారులకు ఇటీవల నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు ఉన్న బ్యారక్‌లో టవర్‌ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు.

Next Story