
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తి చేసుకున్న అనంతరం పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేయడంపై ఏపీ పంచాయతీరాజ్ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించారు. ఈనెల 10న శ్రీకాకుళం,11న కాకినాడ, 14న నరసరావుపేట,15న కడపలో నిర్వహించే సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఏపీలో వ్యవస్థలు గాడి తప్పిన తీరును పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కరవు, పేదరికం, నిరుద్యోగం, మహిళలకు భద్రత లేకపోవడం, అక్రమ కేసులు, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి 13 అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com