
ఏపీలో ఇసుక దోపిడిపై టీడీపీ పోరుబాట పట్టింది. వైసీపీ నాయకుల ఇసుక అక్రమాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల ఇసుక రీచ్‌ల పరిశీలనకు వెళ్ళిన టీడీపీ నాయకులను పోలీసులను అడ్డుకున్నారు. చంద్రగిరిలో టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అధికారపార్టీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని నేతలు ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం కత్తనపర్తి వద్ద పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఇసుక రీచ్ వైపు వెళ్తుండగా టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి ఉషా శ్రీచరణ్ ఇసుక దోపిడికి అడ్డు అదుపు లేకుండాపోయిందని మాజీ ఎమ్మెల్యే హనుమంత రాయచౌదరి ఆరోపించారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గూనాంలో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. చంపావతి నదిలో యథ్చేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని టీడీపీ నేత కరణం శివరామకృష్ణ ఆరోపించారు. అక్రమ ఇసుక సొమ్ము వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఖాతాల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. బొత్స కుటుంబం జిల్లాలో ఇసుక భూములను చెరబట్టిందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com