
జనగామ బీఆర్‌ఎస్‌లో టికెట్ రాజకీయం వేడుక్కుతోంది. బుధవారం ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న హరిత టూరిజం ప్లాజాలో జరిగిన హైడ్రామా దృష్ట్యా....ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గీయులు పల్లా తీరుపై సీరియస్ అయ్యారు. పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్దు అంటూ.... ఎమ్మెల్యే వర్గీయులు జనగామ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనగామలో గ్రూపు రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
మూడు జిల్లాల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ కార్యకర్తలను పిలవాల్సిన అవసరమేంటని ముత్తిరెడ్డి వర్గీయులు ప్రశ్నించారు. జీడిమెట్ల దగ్గర పేదలకు సంబంధించిన మూడు ఎకరాల స్థలాన్ని పల్లా ఆక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉండి జనగామకు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మూడోసారి టికెట్ వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నేత భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పారు. ముత్తిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని అన్న మండలాల కార్యకర్తలు హైదరాబాద్ మల్లాపూర్‌లోని నోమ ఫంక్షన్‌హాల్‌కు తరలివచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వారితో సమావేశం అయ్యారు. కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించారు. పల్లా వద్దు..ముత్తిరెడ్డి ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com