
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాదిమంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం తయారీలో సేంద్రీయ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. అన్న ప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది. వీటితో పాటుగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది, కొవిడ్ సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను తగ్గించారు. అయితే ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇటీవల సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టంను పెంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే అన్న ప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com