Jabalpur Express: పట్టాలు తప్పిన జబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌.. అంతా సేఫ్

Jabalpur Express:  పట్టాలు తప్పిన జబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌.. అంతా సేఫ్

మధ్యప్రదేశ్‌లోన్‌ జబల్‌పూర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇండోర్‌-జబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి.ఇండోర్ - జబల్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు కోచ్‌లు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇండోర్ - జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్ ప్లాట్ ఫామ్‌కు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్లాట్ ఫామ్‌పై ఆగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ లైన్‌లో వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైలు దిగడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లీ ట్రాక్‌పైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైలు జబల్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకోబోతుండగా దాని రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే పీఆర్‌వో హర్షిత్‌ శ్రీవాత్సవ చెప్పారు. ఆ సమయంలో రైలు వేగం గంటకు 5 కిలోమీటర్లుగా ఉందన్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం జరుగలేదని తెలిపారు. అయితే ప్రమాదం జరుగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. కాగా, రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

Next Story