
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కైరోలో బుడనోవ్, ఎస్‌బీయూ చీఫ్ వాసిల్ మాల్యుక్ తదితరులు ఈ హిట్ లిస్టులో ఉన్నారని తెలిపింది. ఈ కుట్రకు సంబంధించి దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారిది అనుమానాస్పద పాత్ర ఉన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఆ కర్నల్స్‌ను విధుల్లోకి తీసుకున్నట్లు ఓ ప్రకటన వివరించింది. గతంలో కూడా జెలెన్‌స్కీ అంతానికి రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. దేశాధినేతను పట్టుకుని చంపించాలనుకుందని, దానిలో భాగంగా, జెలెన్‌స్కీ భద్రతకు దగ్గరగా ఉన్న మిలిటరీలోని బలమైన నేరస్థులను కనుగొనడం రష్యా గూఢచారి సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకుందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. యుద్ధం ప్రారంభయ్యాక తనపై కనీసం ఐదుసార్లు హత్యా యత్నాలు జరిగాయంటూ జెలెన్‌స్కీ గతంలో వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com