
పోలవరం సవరించిన అంచనాలకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.. 55,548.87 కోట్ల మేర రెండవ సవరించిన అంచనాలకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ పెండింగ్‌లోనే ఉండటానికి కారణాలు ఏంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.. దీనికి తప్పంతా వైసీపీ ప్రభుత్వానిదేనని కుండబద్దలు కొట్టినట్లుగా కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పింది.
55 , 548.87 కోట్ల రెండవ సవరించిన అంచనాలకు సలహా కమిటీ ఆమోదం తెలిపిందన్న కేంద్రం.. తరువాత 47 , 725.74 కోట్ల సవరించిన అంచనాలకే రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు చేసిందని తెలిపింది.. సవరించిన అంచనాలకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో ప్రాజెక్టు అథారిటీకి ప్రతిపాదించిందని.. ఆ ప్రతిపాదనకు సంబంధించిన అదనపు సమాచారం, పత్రాలు, సోషియో ఎకనమిక్ సర్వే, డిస్ట్రిబ్యూటరీ నెటవర్క్ డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, రివైజ్‌డ్ కన్‌స్ట్రక్షన్ షెడ్యూల్ సహా అనేక కీలక అంశాలపై ప్రాజెక్టు అథారిటీ రాష్ర్ట ప్రభుత్వం నుంచి వివరాలు కోరిందని తెలిపింది. అయితే, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలు అందించలేదని కేంద్రం లిఖితపూర్వకంగా వెల్లడించింది.. అనేక మార్లు పదేపదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అదనపు సమాచారం పత్రాలు వివరాలు అందించలేదంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com