
ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దేశవ్యాప్తంగా 85వేల కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు తీసే రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును దృశ్యమాధ్యమం ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సాధారణ సేవలు.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు మార్చి 13, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. టిక్కెట్ బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గురువారం మినహా ప్రతీ రోజు ఈ రైలు సేవలు అందించనుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో.. అవసరాల దృష్ట్యా దీన్ని పట్టాలెక్కిస్తున్నారు. వందేభారత్ రైలుతో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలో 193 వన్ నేషన్- వన్ ప్రొడక్ట్ స్టాల్స్, 9 గతిశక్తి కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్స్‌ను ప్రధాని జాతికి అంకితం ఇవ్వనున్నారు. 2 జన్ ఔషధీ కేంద్రాలు, డబుల్ లైన్, థర్డ్ లైన్, గేజ్ కన్వర్షన్, బైపాస్ లైన్ 14 సెక్షన్లు, 3 రైల్ కోచ్ రెస్టారెంట్లు ప్రధాని జాతికి అంకితం ఇస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com