Chandrayan 3: ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో ప్రకటన

యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌక కాలుమోపే అపురూప ఘట్టానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కాసేపట్లో అద్బుతం ఆవిష్కృతం కాబోతోంది. చందమామపై మన విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టబోతోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే క్షణాల కోసం.. భారత్‌తో పాటు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో ప్రకటన చేసింది. ఈ సాయంత్రం 5.44 గంటల సమయంలో నిర్దేశిత ప్రాంతానికి ల్యాండర్ చేరుకోనుంది. అదే సమయంలో ఆటోమెటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అత్యంత క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన ఎత్తులో సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్ స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది.
ల్యాండర్ మాడ్యూల్‌లో పారామీటర్లు అన్నింటినీ తనిఖీ చేస్తుంది. ఎక్కడ ల్యాండ్ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ నుంచి... ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్ మాడ్యూల్‌కు అప్‌లోడ్ చేస్తుంది. షెడ్యూల్డ్ ల్యాండింగ్‌కు ముందు ఈ ప్రక్రియ జరుగుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగుపెడుతుంది. ఇక్కడి నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి.
జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్ కుప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జాబిల్లి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లుగా ఉంటుంది. ఒక విమానం వేగం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ. జాబిల్లి ఉపరితలానికి 6.8 కి.మీల ఎత్తుకు చేరుకున్న తర్వాత... ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి.. మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్‌తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు తగ్గుతాయి. అప్పుడు ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం వెతుకుతుంది. అన్నీ అనుకూలంగా కన్పిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెడుతుంది. అప్పుడు దాన్ని కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి. ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సర్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.
ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత దాని తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి రోవర్ జారుకుంటూ కిందకు వస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది. ల్యాండర్, రోవర్ మొత్తం 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయని ఇస్రో తెలిపింది.
Tags
- vikram lander
- vikram landing
- vikram landing module
- isro on moon landing
- chandryaan landing latest
- moon landing
- vikram
- chandrayaan 3 landing time
- landing time of chandrayaan
- chandrayaan 3 landing
- chandrayaan 2 landing
- chandryaan landing
- vikram lander latest news
- isro moon landing
- india moon landing
- vikram lander update
- vikram lander is safe
- test landing of rlv lex
- isro chandrayaan 2 moon landing
- isro vikram lander
- vikram moon lander
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com