
ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆయనకు విముక్తి లభించింది. ఇందుకు సంబంధించి ఘట్‌కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ (50), భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహ తన పేరు మీద ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భారతమ్మ తెలుసుకుంది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది. ఇంటి స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని చిత్రహింసలు పెడుతున్నది. అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికున్న పోలీసులు నరసింహను విడిపించి స్టేషన్‌కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేశ్, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com