
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పాడ-3 సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురామ్‌పై వాకతిప్ప గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపల్లి మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట పైపులైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు.
సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోనే వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు. అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆయనను కొట్టవద్దని, వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ వారిస్తూ.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళుతుంటే.. అనుచరులు పిడిగుద్దులు కురిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com