
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ నంద్యాల జిల్లా చినదేవళా పురం నుంచి రాజమండ్రి వరకు పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం అభిమానిపై పల్నాడు జిల్లాలో కొందరు దుండగులు దాడి చేశారు. వినుకొండ దాటిన తర్వాత బైకులపై వచ్చిన దుండగులు..తెలుగుదేశం అభిమాని నారాయణను దూషించి దాడికి పాల్పడ్డారు. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు తన స్వగ్రామం నుంచి నారాయణ అనే అభిమాని కాలినడకన రాజమండ్రికి బయలుదేరారు. వినుకొండ దాటి 4 కిలోమీటర్లు వెళ్లాక... విఠంరాజుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు నారాయణపై దాడి చేశారు.
విషయం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆయనను వినుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నలుగురు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించి దాడిచేశారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు పరామర్శించి నధైర్యం చెప్పారు. వినుకొండ MLA బొల్లా బ్రహ్మనాయుడే వైసీపీ కార్యకర్తలతో దాడి చేయించారని ఆంజనేయులు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com